ఇల్లు కట్టుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు, రియల్ ఎస్టేట్ రంగానికి రాబోయే రోజులు మరింత భారంగా మారేలా కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా కాస్త స్థిరంగా ఉన్న సిమెంట్ ధరలు ఇప్పుడు మళ్లీ భగ్గుమంటున్నాయి. జూలై, ఆగస్టు నెలల్లో ఎలాంటి పెద్ద మార్పులు లేకుండా ఉన్న సిమెంట్ ధరలు, సెప్టెంబర్ నెల వచ్చేసరికి ఒక్కసారిగా పైకి కదిలాయి. దేశవ్యాప్తంగా సగటున బస్తాకు రూ.7 చొప్పున ధర పెరగడంతో ప్రస్తుతం సగటు ట్రేడ్ ధర రూ.356కి చేరుకుంది. కొనుగోలుదారులపై ఈ భారం క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.సెప్టెంబర్‌లో దక్కిన ఊపుతో సిమెంట్ కంపెనీలు మరింత ముందుకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. అక్టోబర్ నెలలో మార్కెట్ పరిస్థితిని బట్టి మరోసారి బస్తాకు రూ.5 నుంచి రూ.20 వరకు ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ పెంపు ఎంతవరకు నిలకడగా ఉంటుందనేది పూర్తిగా మార్కెట్‌లో డిమాండ్ పుంజుకోవడం మరియు డీలర్ల స్పందనపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.పెరిగిన ఇంధన ధరల ప్రభావం సిమెంట్ తయారీలో కీలకమైన ఇంధన ధరలు ఇటీవలి వారాల్లో తీవ్రంగా పెరగడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది. తయారీ ఖర్చులు విపరీతంగా పెరుగుతుండటంతో ఆ భారాన్ని కంపెనీలు వినియోగదారులపై మోపుతున్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో కంపెనీలు ధరలు పెంచినప్పటికీ, క్వార్టర్ ముగింపు లక్ష్యాలను చేరుకోవడానికి డీలర్లు పాత ధరలకే విక్రయాలు జరపడంతో ఆ ప్రభావం ఇంకా పూర్తిస్థాయిలో కస్టమర్లకు చేరలేదని సమాచారం.
— elugu vamshidharEditor-in-Chief